శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

తితిదే సిబ్బందికి కరోనా పాజిటివ్ - ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22 వేలకు మించిపోయాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్క రోజే ఏకంగా 1062 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 264కు చేరుకుంది. 
 
అయితే, ఈ కరోనా మహమ్మారి ఇపుడు... ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
 
తాజాగా, కరోనా బారిన పడిన సిబ్బందికి భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. కాగా, ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. 
 
ఇదిలావుంటే కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు.
 
కాగా ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పడం గమనార్హం.