మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (06:54 IST)

తెలంగాణలో మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారు: ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జర్నలిస్టు ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో 'మీడియా -- ఉద్యోగభద్రత' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ....ప్రస్తుతం తెలంగాణలో భూముల కబ్జా,  మీడియా కబ్జా చేస్తూ, అయిన వారితో మీడియా  సంస్థలను కొనుగోలు చేస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి చేపట్టే కార్యక్రమాలను ఢిల్లీ స్థాయికి వెళ్ళి జనాల్ని చైతన్యం చేయాలన్నారు. న్యాయపరమైన అంశాల కోసం  జర్నలిస్టులు పోరాటం చేయాలని కోరారు.

చట్టాల పైన అవగాహన,  ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా కార్పొరేట్ సంస్థలను నియంత్రించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం  ఉందన్నారు.   జర్నలిస్టుల సమస్యలపై తాము ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి ఉద్యమాలకు సహకరిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అలాంటి జర్నలిస్టులే తెలంగాణ రాష్ట్రంలో వారి హక్కుల కోసం పోరాటం చేయడం దురదృష్టకరం అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం తగదన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఢిల్లీ స్థాయిలోఉద్యమానికి  తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ... నేటి పోటీ ప్రపంచంలో సమాజం  పై అవగాహన  గల సిటిజన్ లు జర్నలిస్టు మాత్రమే అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందాన్నారు. జర్నలిస్టుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, జర్నలిస్టు పోరాటం కోసం తమ పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని  ప్రకటించారు.

మనం  తెలుగు దినపత్రిక ఎడిటర్ ఉప్పరి రమేష్ మాట్లాడుతూ.... జర్నలిస్టులు యజమాన్య స్థాయికి ఎదగాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల కోసం యాజమాన్యాoతో  కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. మనం పత్రికలో జర్నలిస్టులకు ఇబ్బంది ఉండదని ఉద్యోగ భద్రత కు కృషి చేస్తామన్నారు. ఎన్నికల నిఘా  సమితి కన్వీనర్ బి.వి.రావ్  మాట్లాడుతూ సమాజంలో మేధావి వర్గం గా ఉన్న జర్నలిస్టులకు అభద్రతాభావంతొ  ఉండటం దురదృష్టకరమన్నారు.

పిసిసి  అధికార ప్రతినిధి పీ. నాగిరెడ్డి,  శ్రీరామ్ సీనియర్ జర్నలిస్ట్,  సివేరి శ్రీశైలం, ఆనం చిన్ని  వెంకటేశ్వరరావు,  శివసేన రాష్ట్ర  అధ్యక్షులు  సుదర్శన్,  ఎం.సి. బి తెలంగాణ శాఖ అధ్యక్షులు సాముల రవీందర్,  అభిలాష్, టీజేఎస్ యూత్ అధ్యక్షులు రమేష్ లు  మాట్లాడారు.

కార్యక్రమానికి జర్నలిస్టు ఫోరం ఫర్ తెలంగాణ అధ్యక్షులు అమర్ అధ్యక్షత వహించారు.ఈ  కార్యక్రమంలో జర్నలిస్టు సంపత్,  విద్యా వెంకట, సత్యం  బాగిలి,  గోపి యాదవ్,  ప్రసాద్,  హరి, రాజేష్,  శ్రీకాంత్,  ఆనంద్ రావు,  అనిల్, రాహుల్ గౌడ్, విజయేందర్  రెడ్డి, కస్తూరి  సురేష్, ఆంజనేయులు  తదితరులు పాల్గొన్నారు.