బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (19:28 IST)

త్వరలోనే బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు దళితబంధు.. కేసీఆర్ శుభవార్త

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప శుభవార్త చెప్పారు. ఇప్పటికిప్పుడు కాకున్నా త్వరలోనే బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు దళితబంధు తరహాలోనే రూ.10 లక్షల చొప్పున ‘పేదల బంధు’ తీసుకొస్తామని సంచలన ప్రకటన చేశారు. అది ఎప్పుడన్నది మాత్రం చెప్పకుండా ‘భవిష్యత్’లో అని ఆశలు రేకెత్తించారు.
 
తెలంగాణలో దళితుల దరిద్రం వదిలేలా సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులకు ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 
 
దళితబంధు తర్వాత ప్రాధాన్యక్రమంలో మిగిలిన వర్గాలకు పథకాలు తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్ లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ ‘పేదలబంధు’ కూడా తెస్తామని సంచనల ప్రకటన చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామన్నారు. 
 
మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ నే అధికారంలో ఉంటుంది అని పార్టీ నేతలకు రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఇక ఈ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో అసలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావనే రాలేదని మంత్రి కేటీఆర్ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాక హుజూరాబాద్ ఉప ఎన్నికపై వ్యూహరచన చేస్తామని తెలిపారు. 
 
ఇక 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ అక్టోబర్‌లో ప్రారంభిస్తారని.. సెప్టెంబర్ 2న కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం భూమి పూజ నిర్వహించబోతున్నట్టు తెలిపారు.