బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (18:35 IST)

మంత్రులను తొలగించడంలో కేసీఆర్ బిజీబిజీ, కరోనా కట్టడికి చర్యలేవీ? షర్మిల ప్రశ్న

కరోనా మహమ్మారితో రాష్ట్రంలోని ప్రజలంతా తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కోవిడ్‌ చికిత్స పొందలేక, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ, విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి.. ఇలా జనజీవనం అస్తవ్యస్తమైందని వైఎస్ షర్మిల అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... మరీ మన రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండి ఆదుకోవాల్సిన సర్కార్‌.. నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తోంది. రాజకీయాలు, మంత్రులను తొలగించడం, ఉనికి కాపాడుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజలపై కాపిశ్కడంతైనా పెట్టడం లేదు. టీఆర్‌ఎస్‌ నియంత్రృత్వ పోకడపై ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలు ఆలోచన చేయాలి. వారి తీరును ఎండగట్టాలి.
 
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి..
కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మొదట్నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. కానీ, సర్కార్‌ మాత్రం పెడచెవినపెడుతూనే వస్తోంది. కరోనా వైద్యం అందక పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలు బతుకులు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నాయి. సరైన చికిత్స అందక, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని తాళలేక తెలంగాణ తల్లడిల్లిపోతోంది. దయచేసి ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను యాదిలో పెట్టుకొని కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. పేద ప్రజలను ఆదుకోవాలి.
 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ల మాటేంటీ..?
ప్రైవేట్‌ ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కుటుంబ ఆరోగ్య భద్రత కోసం రూపాయి రూపాయి పోగు చేసి  హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు కడితే.. వాటిని కూడా ఆస్పత్రులు యాక్సెప్ట్‌ చేయడం లేదు. సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల సంగతీ అందరికీ ఎరుకున్నదే. ఒక్క బెడ్‌కు ఇద్దర్ని కేటాయించి వైద్యం అందిస్తుంటిరీ. వారిలో ప్రాణాలతో బయటకు ఎంతమంది వస్తారో తెలియని దుస్థితిల ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యం, సదుపాయాలు ఉన్నయ్‌.
 
పేద ప్రజలను ఆదుకోవాలి..
కోవిడ్‌ బీమారి వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఉపాధి కోల్పోయిన కూలీలు, తోపుడుబండ్ల వ్యాపారులు, రజకులు, చేతి వృత్తులను నమ్ముకొని పొట్టపోసుకునే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.. ప్రతి కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందించాలి. రేషన్‌ సరుకులు, మరో 5 కేజీల బియ్యాన్ని అదనంగా ఇవ్వాలని కేసీఆర్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.
 
రైతులను ఇబ్బందులు పెట్టొద్దు..
ఆదర్శ రైతును, పెద్ద రైతును అని చెప్పుకున్న కేసీఆర్‌ గారు.. ఆ మాటలను మరువకుండా రైతులను ఆదుకోవాలి. పంట చేతికొచ్చే సమయమొచ్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందకపోతే ఆ రైతుతో పాటు, ఆ కుటుంబం ఎదుర్కొనే కష్టం అంతాఇంతా కాదు. దయచేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించండి. దళారీ వ్యవస్థను నిర్మూలించండి.
 
ఎన్నికల సమయంలో హామీలిచ్చి.. ఓట్లేసి గెలిపించిన ప్రజలను గొర్రెల్లా చూసే మీ ధోరణిని ఇప్పటికైనా మానుకోండి కేసీఆర్‌ గారూ.. దయచేసి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు, నిరుపేదలను ఆదుకునే పెద్ద మనసు చేయండి అంటూ పేర్కొన్నారు.