శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (13:43 IST)

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ... భాజపాలోకి జంప్ చేసేందుకు కొండా దంపతులు రెడీ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఓ వెలుగు వెలిగిన నాయకురాలు కొండా సురేఖ. మంత్రిగా ఆమె తెలంగాణలో మంచి పాపులారిటీ సాధించారు. ఐతే ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కొన్నాళ్లపాటు జగన్ మోహన్ రెడ్డితో పాటు నడిచిన కొండా సురేఖ ఆ తర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఐతే అక్కడ కూడా ఇమడలేక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఐతే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. 
 
లోక్ సభ ఎన్నికల తర్వాత ఏకంగా 12 మంది కాంగ్రెస్ నాయకులు తెరాస గూటికి చేరిపోయారు. తెరాసతో విభేదించేవారు భాజపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు తర్వాత వంతు కొండా దంపతులకు వచ్చిందంటున్నారు. గత కొన్నిరోజులుగా వారు భాజపా అగ్ర నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 
 
తెలంగాణలోని భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ హామీ మేరకు భాజపా తీర్థం పుచ్చుకునేందుకు కొండా దంపతులు సుముఖంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి భాజపా కొండా కపుల్ డిమాండ్లకు సరే అంటుందా లేదా చూడాల్సి వుంది.