బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:41 IST)

రూ.10 కోట్లిస్తా పోటీ చేయమన్నోడు.. ఇపుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లే : నాయిని

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాడు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న నాయిని రాష్ట్ర హోం మంత్రిగా పని చేశాడు. అయితే నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ముషీరాబాద్‌ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నాడు. కానీ, ఆయనకు ఇవ్వకుండా ఆయన అల్లుడు శ్రీనివాస రెడ్డికి ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్‌ను కోరారు. ఇంతవరకు బాగానే ఉంది.
 
కానీ, ఇటీవల వెల్లడించిన తెరాస అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో నాయిని అల్లుడు పేరు లేదు. దీనిపై నాయిని షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'సీఎం కేసీఆర్‌కు నువ్వు చాలా దగ్గర కదన్నా.. ముషీరాబాద్‌ టికెట్‌ మీ అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి వస్తుందా? లేదా..? అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు అడుగుతున్నారు. నాకు చాలా తికమక అవుతుంది. బాధ కూడా కలుగుతుంది' అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. 
 
తనను కలిసిన కొందరు విలేకరులు ముషీరాబాద్‌ టికెట్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ముషీరాబాద్‌ టికెట్‌ను తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వడంలో సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది ఉంటే తనకు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో పని చేసుకోమని శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ సంవత్సరం క్రితమే చెప్పారని గుర్తుచేశారు. 
 
శ్రీనివాస్ రెడ్డికి టికెట్‌ గురించి మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు కలిశానన్నారు. తనతో మాట్లాడిన తర్వాతే ముషీరాబాద్‌ టికెట్‌పై నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్‌ చెప్పారని.. తొందరపడొద్దని భరోసా ఇచ్చారన్నారు. 2014లో తాను ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానంటే 'వద్దు నర్సన్నా, నిన్ను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చెయ్యి' అని కేసీఆర్ అన్నారన్నారు. 
 
పైగా, బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనంటే.. 'నీ తమ్ముడిని నేనున్నా. రూ.10 కోట్లు ఇస్తా. పోటీ చెయ్యి' అని చెప్పారని నాయిని తెలిపారు. అలాంటి కేసీఆర్ ఇపుడు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారని వాపోయారు. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని.. కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏదేమైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని నాయిని నర్సింహా రెడ్డి స్పష్టంచేశారు.