కేసీఆర్ సాధించిన ఘనత ఇదే : పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెరాస అధినేత కేసీఆర్ సాధించిన ఘనత ఒక్కటే ఒక్కటని అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమని కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
కరీంనగర్లో గురువారం మాట్లాడుతూ... కేసీఆర్కు నైతిక విలువల్లేవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే ఈ ఏడాదికి ఆయన సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పాచిక వేశారనీ, కానీ అవి పని చేయక పోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలపై టార్గెట్ పెట్టారన్నారు.
ఇకపోతే.. రాజధాని హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఆ కార్యక్రమ నిర్వహణకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో బహిర్గతం చేయాలని కోరారు.