శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (13:32 IST)

గంజాయి మత్తుకు కారంతో మందు - అమ్మ ట్రీట్మెంట్

red chilli powder
కన్నబిడ్డ గంజాయి మత్తుకు అలవాటు పడటాన్ని కన్నతల్లి జీర్ణించుకోలేక పోయింది. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ మాట వినలేదు. గంజాయి మత్తు చెడు అలవాటను మానుకోవాలని పదేపదే ప్రాధేయపడింది. ఆయినా బిడ్డ పద్ధతి మార్చుకోలేదు. దీంతో కన్నతల్లి కన్నెర్రజేసింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకుని కరెంట్ స్తంభానికి కట్టేసింది. కర్రతో కొట్టింది. ఆ తర్వాత కళ్లలో కారం కొట్టింది. అమ్మ ఇచ్చిన కారం ట్రీట్మెంట్‌ దెబ్బకు మత్తు గంజాయి మత్తు దిగిపోయింది. ఇకపై బుద్ధిగా ఉంటానని కాళ్లావేళ్లా పడ్డాడు. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. కోదాడ, గాంధీనగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఏడాదిగా గంజాయికు అలవాటు పడ్డాడు. కూలీపనులు చేసుకునే తల్లిదండ్రులు గంజాయి జోలికి వెళ్లవద్దని చాలాసార్లు కొడుకును వేడుకున్నారు. చదువు మీద దృష్టి పెట్టమని పలుమార్లు తల్లి కూడా బతిమలాడింది.
 
అమ్మ మాటలను పెడచెవిన పెట్టిన కొడుకు గంజాయి మత్తులో సోమవారం ఉదయం ఇంటికొచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లి.. కొడుకుని రోడ్డు మీదకు తీసుకొచ్చి విద్యుత్తు స్తంభానికి కట్టేసింది. అనంతరం మొహం, కళ్లలో కారం చల్లింది. ఇందుకు స్థానిక మహిళ ఒకరు ఆమెకు సహకరించారు. కళ్లలో కారం పడి మంటలకు అల్లాడిపోయిన ఆ కొడుకు ఆర్తనాదాలు చేస్తూ ఇంకోసారి తప్పు చేయనని వేడుకున్నాడు. 
 
కొడుకు బాధ చూసి కంట నీరు పెట్టుకున్న ఆ తల్లి.. కుమారుడిలో మార్పు కోసం ఓపిక పట్టింది. సుమారు 15 నిమిషాల తర్వాత స్థానికులు ఆ బాలుడిని స్తంభం నుంచి విడిపించింది. కొడుకును దారిలో పెట్టుకునేందుకు తాను చేసింది తప్పుకాదని సమర్థించుకుంది. పోలీసులు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆమె విజ్ఞప్తి చేసింది.