గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:43 IST)

తెలంగాణ బీజేపీ బలోపేతానికి అధిష్టానం కసరత్తు!

తెలంగాణ బీజేపీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి పటిష్టంగా నిలబెట్టేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు బీజేపీ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది.

కాగా బండి సంజయ్ తనవంతు కృషితో ఇప్పటికే బీజేపీని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. దీనికి ఉదాహరణగా ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు లేని బీజేపీలో ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
 
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ప్రస్తుతం కేంద్ర కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అని ప్రకటించారు.

దీంతో బీజేపీ వర్గాల్లో చిన్న అలజడి మొదలైంది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి, సీనియారిటీ పరంగా బండి సంజయ్ కంటే ముందుంటారు. అందుకే ఆయనకు కాకుండా తెలంగాణ సీఎం పదవి బీజేపీలో ఇంకెవరికి ఇస్తారు అని కొంతమంది చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
కానీ కిషన్ రెడ్డి హయాంలో బీజేపీ పార్టీ పెద్దగా ముందుకు వెళ్లలేకపోయిందని, ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి హవా ఏం సాగలేదని బండి సంజయ్ వర్గీయలు అంటున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి బండి సంజయ్ ముఖ్య కారణమని, 2023లో బీజేపీని అధికార పార్టీగా నిలబెట్టి సీఎం పదవిని చేపట్టేది ఆయనేనని బండి వర్గీయులు ధీమాగా ఉన్నారు.

మొత్తానికి తెలంగాణ బీజేపీలో ముసలం మొదలయ్యిందని ఆదిలాబాద్ ఎంపీ వ్యాఖ్యలు నిరూపించాయి. మరి ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.