మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:41 IST)

పవన్ కళ్యాణ్ పై తెలంగాణ బీజేపీ ఆశలు

మున్సిపల్ ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాలకే పరిమితం అయిన భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బలపడేందుకు పవన్ కళ్యాణ్‌పై భారీగా ఆశలు పెంచుకుంది.
 
తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ బిజెపిని గట్టేక్కిస్తాడా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏపీలో పవన్‌కు అభిమానులు తెలంగాణ కంటే ఎక్కువగానే ఉంటారు.

తెలంగాణలో కూడా పట్టణ ప్రాంతాల్లో పవన్ అభిమానులు బిజెపికి కలిసి వస్తే అది రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి సహకరించినట్లవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.
 
ఇటీవలే ఢిల్లీలో జాతీయ బీజేపీ నేతలను కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీలో రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. బిజెపితో కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
 
తెలంగాణలో కూడా త్వరలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యమ ప్రణాళికను బీజేపీ సిద్ధం చేయనునుంది. 
 
తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడు పెంచడంతో పవన్ కళ్యాణ్ కూడా తమతో జత కలిస్తే మరింత ఉధృతంగా ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అవకాశం దక్కుతుందని రాష్ట్ర బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.
 
అయితే మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేకపోవడంతో కమలనాథులు పవన్ కళ్యాణ్‌తో కలిసి దీర్ఘకాలికంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజెపి నేతలు కసరత్తు చేస్తూనే మరోవైపు పార్టీ పరంగా బలపడాల్సిన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.