శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:05 IST)

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బడులు లేవు.. కారణం అదే..?

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తెరిచే విషయంలో తెలంగాణ విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవకూడదని నిర్ణయించింది. పాఠశాలలు తెరిచినా.. పిల్లలను తల్లిదండ్రులు సూళ్లకు పంపించేందుకు అంగీకరించకపోవచ్చునని భావిస్తోండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు.
 
ఒక వేళ పాఠశాలలను తెరిచినా కూడా పిల్లలు భౌతిక దూరం పాటించడం అసాధ్యం, ఒకవేళ పిల్లలు ఈ వైరస్ బారిన పడితే.. ఇంట్లోని పెద్దలకు, వృద్దులకు ప్రమాదం ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే 5వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది భోదన వద్దని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో 11.36 లక్షల మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. ఇక, నర్సరీ-యూకేజీ మధ్య చదువుతున్న వారు ఆరేడు లక్షల మంది వరకు ఉంటారు. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. 
 
ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకుంటారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.