మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (15:27 IST)

పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... : బండి సంజయ్

బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 
 
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సంర్భంగా మాట్లాడుతూ '1948లో హైదరాబాద్‌ను పాకిస్థానులో కలపాలని ఎంఐఎం కోరింది. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారింది. 
 
ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవు. బీజేపీ చెప్పింది చేస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు' అని అన్నారు. 
 
అంతేకాకుండా, ఎంఐఎం పార్టీ ఒక ఉగ్ర సంస్థ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే తమ అడ్డా పెడతామన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ఇక్కడ రోహింగ్యాలు ఉన్నట్టైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.