సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

వెనుకటికొకడు పావురాల గుట్టలో పావురమై పోయాడు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల(బల్దియా ఎన్నికలు) పోలింగ్ సమీపిస్తోంది. డిసెంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగనుంది. దీంతో హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీల నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా, తెరాస, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోణలు చేస్తున్నారు. తాజాగా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన రఘునందన్ రావు తెరాస నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. 
 
ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "వెనుకటికి ఒకడుండేవాడు. పావురాల గుట్టల్లో పావురమైపోయిండు. మీకు అదే గతి పడుతుంది. నేను సైన్స్‌ టీచర్‌ను. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది" అంటూ వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి మారుపేరుగా తయారయ్యారని, హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
 
హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాదు అభివృద్ధి అంశాన్ని తాము చూసుకుంటామని, కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా, తెరాస నాయకులపై పైవిధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 
 
గతంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ పావురాల గుట్టవద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. 
 
మరోవైపు, రఘునందన్‌ రావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల సమక్షంలోకి వెళ్లి వారికి ఏంచేస్తామో చెప్పి ఓట్లను అభ్యర్థించాలే, తప్ప దిగజారుడు రాజకీయాలకు పాల్పడటమేమిటని మండిపడుతున్నారు. 
 
చనిపోయిన వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడకూడదనే ఇంగితజ్ఞానం కూడా లేని మనిషికి ఇదే తొలిసారి, చివరిసారి గెలుపని కొందరు ధ్వజమెత్తారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.