శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అమెరికాకు కేటీఆర్.. ఫాంహౌస్‌కు కేసీఆర్... దుబ్బాక ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌లపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముఖ్యంగా, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. 
 
తెరాసను జీహెచ్ఎంసీ బరిలో మట్టికరిపిస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి మారుపేరుగా తయారయ్యారని, హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
 
హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాదు అభివృద్ధి అంశాన్ని తాము చూసుకుంటామని, కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. మౌలాలి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సునీతా యాదవ్ తరఫున రఘునందన్ రావు ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
 
మరోవైపు, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గన్ ఫౌండ్రీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు బీజేపీ కార్యాలయం వేదికైంది. 
 
శైలేందర్ యాదవ్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. బీ ఫారం తీసుకునేందుకు ఓంప్రకాశ్ బీజేపీ కార్యాలయానికి రాగా, శైలేందర్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓంప్రకాశ్ కు టికెట్ ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగారు. 
 
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలు విసిరేంత వరకు వెళ్లింది. ఓ వర్గం వారు ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.