శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (21:07 IST)

నన్ను చిత్రహింసలు పెట్టారు, తిరుపతిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్

నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. క్షణక్షణం ఉత్కంఠ మధ్య ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బిజెపి అభ్యర్థే చివరకు విజయం సాధించారు. అయితే తన విజయం తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. 
 
తనపై అక్రమ కేసులు పెట్టి ఓడించాలని టిఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని చెప్పారు రఘునందన్ రావు. ఒక సామాన్య వ్యక్తి గెలుస్తాడా అని నన్ను ఎగతాళిగా మాట్లాడారని, కానీ తెలంగాణా చరిత్రలోనే ఇది ఒక భారీ విజయమని సంతోషం వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే.
 
ఈ విజయం ప్రజలదేనన్న రఘునందన్ రావు నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతోనే తన విజయం సాధ్యమైందన్నారు. గ్రామీణ ప్రాంతమైన దుబ్బాక ప్రజలు బిజెపిపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు.
 
దుబ్బాక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. ప్రజా సేవలకు అంకితమవుతానన్నారు. టిఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నమ్మకం పోయిందన్న రఘునందన్ రావు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలం బాగా పెరుగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు.