బీజేపీ గెలిస్తే హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు : మంత్రి శ్రీనివాస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన గెలుపుతో బీజేపీ నేతలు సమరోత్సాహంతో బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదేసమయంలో గ్రేటర్ హైదరాబాద్ కోటపై మరోమారు గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీ నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
పైగా, ఎన్నికల సమయం సమీపిస్తుండంతో నేతలు విమర్శలకు కూడా పదును పెడుతున్నారు. ఇందులోభాగంగా, తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీపై ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. గతంలో ప్రధాని సైతం కేసీఆర్‌ను ప్రశంసించారని, కానీ ఇప్పుడు ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు.
తాము మేయర్ పదవిని ఎంఐఎంకు ఇస్తామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది హాస్యాస్పదమైన విషయమన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రంపై చార్జిషీట్ వేయాలన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణకు క్షమాపణలు చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు. బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, తెరాస ప్రభుత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చేస్తూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చార్జిషీట్ పేరిట ఓ జాబితా విడుదల చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
"మాపై బీజేపీ, ప్రకాశ్ జవదేవకర్ ఎందుకు చార్జిషీట్ విడుదల చేశారు? పేదల కడుపునింపే అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించినందుకా? నగరంలో ఎల్ఈడీ లైట్లు అమర్చినందుకా? హైదరాబాదులో శాంతిని నెలకొల్పినందుకా? లేకపోతే, కొత్త పెట్టుబడులు తీసుకువస్తున్నందుకా?" అంటూ నిప్పులు చెరిగారు.
ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వంపైనే చార్జిషీట్లు నమోదు చేయాల్సి వస్తే... ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న ఒక్క హామీపైనే 132 కోట్ల చార్జిషీట్లు వేయొచ్చని కేటీఆర్ విమర్శించారు. బంజారాహిల్స్ లోని జెహ్రాన్ నగర్‌లో జరిగిన రోడ్ షో సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.