ఆస్తి పంపకానికి తమ్ముడు నిరాకరణ... అన్న ఆత్మహత్య
తండ్రి సంపాదించిన ఆస్తిని పంచి ఇచ్చేందుకు తమ్ముడు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేటలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బేగంపేట వాస్తవ్యుడు కృష్ణారెడ్డి (48) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కృష్ణారెడ్డి ఏపీలోని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తమ్ముడు కొండల్‌రెడ్డి ఊర్లోనే ఉంటున్నాడు.
తండ్రి నర్సింహారెడ్డి తాను కొన్న 10 ఎకరాల్లో రెండెకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. నర్సింహారెడ్డి మృతిచెందిన తర్వాత కొండల్‌రెడ్డి ఒక్కడే ఆ 8 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకోవడంతో వివాదం మొదలైంది.
పలుమార్లు తనకు రావాల్సిన వాటా 4 ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కొండల్‌రెడ్డిని కృష్ణారెడ్డి కోరాడు. గ్రామపెద్దల ముందు అన్నకు రావాల్సిన వాటా ఇస్తానని చెప్పిన కొండల్‌రెడ్డి అనంతరం మొహం చాటేస్తుండటంతో కృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణారెడ్డి చావుకు తమ్ముడు కొండల్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ బంధువులు కొండల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో కృష్ణారెడ్డి ఇద్దరు కొడుకులు అనాథలుగా మారారని, ఇప్పటికైనా ఆస్తిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.