మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:25 IST)

మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన : తెరాసమంత్రి జగదీష్ రెడ్డి

jagadish reddy
రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిస్తే తొలుత స్వాగతించేది వైకాపాయేనంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని చెప్పడం తెలివి తక్కువ వాదన అంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రెండుగా విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన అని స్పష్టం చేశారు. ఒకవేళ సజ్జల చెప్పినట్టుగా జరిగితే ఏపీ తమకు కావాలని మద్రాస్ వాళ్లు కూడా అడగొచ్చని, భారతదేశం తమకుకావాలని ఇంగ్లండ్ మళ్లీ అడగొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అందువల్ల ఇవన్నీ అర్థంలేని వాదనలని, మీడియా సంచలనాలకోసం తప్ప ఈ వాదనలో ప్రయోజనం లేదని హితవు పలికారు. చరిత్రను వెనక్కి తిప్పడం ఎవరివల్ల కాదని మంత్రి అన్నారు. నాడు తెలుగు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాను బలవంతంగా కలిపారని, 60 యేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం తనను తాను ఆవిష్కరించుకుందని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 
సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి... : వైఎస్ షర్మిల 
రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల మండిపడ్డారు. సజ్జలవి అర్థంలేని వ్యాఖ్యలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, రెండు రాష్ట్రాలు కలవడం అనేది అసాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకుంటున్నామంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. 
 
"నేడు తెలంగాణ ఒక వాస్తవం అని ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. ఇపుడు రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని ఆమె జోస్యం చెప్పారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి.. విభజిత రాష్ట్రాలు మళ్లీ ఎలా కలుపుతారు అంటూ ప్రశ్నించారు. 
 
మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడంపై కాదు. మీ ప్రాంత అభివృద్ధిపై ధ్యాస పెట్టాలి. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం మీకు తగదు" అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ఉమ్మడి ఏపీని చేసేందుకు కృషి : సజ్జల రామకృష్ణా రెడ్డి 
నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన రెండు రాష్ట్రాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మళ్లీ ఒక్కటి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీలో సకల శాఖామంత్రిగా పేరుగడించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 
 
రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. వీలైతే ఏపీని మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే తొలుత స్వాగతించేది వైకాపాయేనని సజ్జల స్పష్టం చేశారు. 
 
ఇపుడే కాదు.. ఎపుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పార్టీ వైఖరి కూడా ఇదేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు బలంగా వినిపించామని, చెప్పారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలని లేదా సరిదిద్దాలని కోరతామని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని ఆయన తెలిపారు.