మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (07:49 IST)

అన్నా డ్రగ్స్‌ ఇంతవరకు చూడలేదు.. ఫ్యామిలీతో కలిసి పబ్‌కు వెళ్లా : రాహుల్

హైదరాబాద్‌ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై జూబ్లీ హిల్స్ పోలీసుల దాడులు సందర్భంగా తన అరెస్టుపై టాలీవుడ్ గాయకుడు, తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాత్రి రాత్రి 11:30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. పోలీసులు అర్థరాత్రి 1:45 నుండి 2 గంటల సమయంలో దాడులు నిర్వహించారని తెలిపారు. 
 
డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఇప్పటికే అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. కిక్కిరిసిపోవడంతో నిర్ణీత సమయానికి మించి పబ్ నుంచి బయటకు రాలేకపోయానని చెప్పారు. తన ఫ్రెండ్ పార్టీ చేసుకుంటుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ పబ్‌కు వెళ్లినట్టు చెప్పారు. 
 
అక్కడ నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తమన్నారు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు తన శాంపిల్స్ ఇస్తానని ప్రకటించారు. అన్నా.. డ్రగ్స్ ఎలా ఉంటాయో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారు. నేను పబ్ నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆపారని, వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో తనకు తెలియదని చెప్పారు. అయితే, పబ్‌లో మాత్రం 200 మంది వరకు ఉన్నారని చెప్పారు. దీంతో లోపలి నుంచి బయటకు రావడానికే 20 నిమిషాల సమయం పట్టిందన్నారు.