గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (14:04 IST)

తెలంగాణాలో టీడీపీకి షాక్ : తెరాసలోకి ఎల్.రమణ

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ‌ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత పార్టీకి రాజీనామా చేసి అధికార తెరాస పార్టీలో చేరనున్నారు.
 
ఇందుకోసం గురువారం ముహూర్తంగా నిర్ణయించుకుని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో గులాబీ బాస్‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కు ఆయ‌న రానున్నారు. ఇప్ప‌టికే ఎల్.ర‌మ‌ణ్ త‌న‌ కార్యకర్తలు, అభిమానులతో పార్టీ మారే విష‌యంపై చ‌ర్చించారు.
 
కేసీఆర్‌తో భేటీ అనంత‌రం మీడియా సమావేశం నిర్వ‌హించి ఎల్.రమణ దీనిపై వివరాలు తెల‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి, ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డం దాదాపు ఖ‌రార‌యిన‌ట్లేన‌ని స‌మాచారం. 
 
ఆయ‌న పార్టీ మార‌నున్న‌ట్లు గత కొన్ని నెలలుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఎల్‌.ర‌మ‌ణ‌తో ఇప్ప‌టికే టీఆర్ఎస్ చ‌ర్చ‌లు జ‌రిపింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డమే కాకుండా, ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ పరాజయాన్ని చవిచూశారు.  
 
కాగా, ఇప్పటికే తెలంగాణాలో టీడీపీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఇలాంటి వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అలాగే, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి ఇలా బడా రాజకీయ నేతలంతా టీడీపీని వీడి తెరాసలో చేరిన విషయం తెల్సిందే.