శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (09:13 IST)

తెలంగాణాలో స్తంభించనున్న ప్రభుత్వ వెబ్‌సైట్‌ సేవలు

తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం వెబ్‌సైట్ సేవలు నిలిచిపోనున్నయి. రెండు రోజుల పాటు ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
 
రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలు అంతకంతకు పెరుగుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై (యూపీఎస్) సామర్థ్యం సరిపోవడం లేదు. 
 
ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో దాని స్థాయిని పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. దీంతో కొత్త యూపీఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని అందించింది.