బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (08:21 IST)

కాంగ్రెసును వీడి తప్పు చేశా: డీఎస్

‘కాంగ్రెస్ పార్టీని వీడటం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు’ అని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవమానం జరిగింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని వీడానని అన్నారు.

దిగ్విజయ్‌ సింగ్‌తో పడకపోవడం వల్లే కాంగ్రెస్‌ను వీడానని అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాలలో అనవసరంగా మాట్లాడకూడదనే ఇన్నాళ్లు దూరంగా ఉన్నానని చెప్పారు. స్వార్థ రాజకీయాలు చేయకూడదన్నారు.

తన గురించి మాట్లాడే దమ్ము జిల్లా నాయకులకు ఎవరికైనా ఉందా? అని డీఎస్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనపై యాక్షన్ తీసుకోవాలంటూ టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ.. సపోర్ట్ చేసింది బీజేపీ అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ పేరుతో తండ్రి, కొడుకు, కూతురు బంగారం అయ్యారంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
40 ఇళ్లు గుత్తేదారు తీసుకుని ఏం చేశారని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, ముందుగా వారు ఏం చేశారో చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫండ్ మొత్తం రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేశామన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని వివరించారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.90 కోట్లతో చేపట్టామని అన్నారు. మెడికల్ కాలేజీ కోసం తన ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని డీఎస్ ప్రకటించారు. నిజామాబాద్ ప్రజలు మంచి వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నగరానికి మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.