శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:58 IST)

హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

వైద్యారోగ్య శాఖ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. 

రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్‌ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు.

నేటి నుంచి స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు వివరించారు. చిన్న పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని అధికారులు వివరించారు. దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని  వైద్యారోగ్య శాఖ అధికారులకు కేబినెట్‌ స్పష్టం చేసింది.

రూ.133 కోట్లతో పడకలు, మందులు, ఇతర సామగ్రి, చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి ముందస్తు ఎర్పాట్లలో భాగంగా 5,200 పడకలు ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని తదుపరి కేబినెట్ సమావేశంలో సమర్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

24 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు..
ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..
పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.

కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో ఉప సంఘం ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.