శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (08:59 IST)

పత్తిచేనులో పెద్దపులి... తల్లి చూస్తుండగానే బిడ్డను ఈడ్చుకెళ్లింది...

ఓ గ్రామంపై పెద్దపులి విరుచుకుపడింది. దీంతో ఆ గ్రామవాసులంతా ప్రాణభయంతో హడలిపోయారు. అయినప్పటికీ.. ఓ బాలికను పొట్టనబెట్టుకుంది. అదీకూడా తల్లి కళ్ళముందే ఆ బిడ్డను పెద్దపులి నోట కరిపించుకుని ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 11న విఘ్నేశ్ అనే 19 ఏళ్ల యువకుడిని పొట్టనపెట్టుకున్న పులి.. తాజాగా ఆదివారం ఓ బాలిక ప్రాణాలు తీసింది. పత్తి ఏరుతున్న బాలికను తల్లి, సోదరుడు, కూలీలు చూస్తుండగానే ఈడ్చుకెళ్లింది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి శివారులో జరిగిందీ ఘటన.
 
అన్నెం సత్తెయ్య అనే రైతు పొలంలో పత్తి ఏరేందుకు నిర్మల (16), ఆమె సోదరుడు రాజేశ్, తల్లి లక్ష్మక్క, మరో ఏడుగురు కూలీలు వెళ్లారు. మధ్యాహ్నం వరకు పత్తి ఏరిన అనంతరం వారిలో కొందరు భోజనానికి కూర్చోగా, నిర్మల, మరో స్నేహితురాలితో కలిసి చేనుకు మరో వైపున పత్తి ఏరుతోంది. 
 
ఈ క్రమంలో అకస్మాత్తుగా వారిపై దాడిచేసిన పులి నిర్మలను నోట కరుచుకుని వెళ్లిపోయింది. నిర్మల అరుపులు విని అప్రమత్తమైన వారు కర్రలతో వెంబడించడంతో కొద్దిదూరం వెళ్లాక నిర్మలను వదిలిపెట్టి వెళ్లిపోయింది. అయితే, అప్పటికే తీవ్ర గాయాలపాలైన నిర్మల అక్కడికక్కడే చనిపోయింది. 
 
సమాచారం అందుకున్న డీఎఫ్ఓ శాంతారాం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.