సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (21:08 IST)

రాజశేఖర్ రెడ్డి, కిరణ్ రెడ్డిని వీధిలోకి ఈడ్చుతున్న టిఆర్ఎస్.. ఎందుకు?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. కాంగ్రెస్‌ పైన, టిడిపిపైన ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చడానికి పాత విషయాలను తిరగదోడుతున్నారు. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేయడం కోసం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని, నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా వీధుల్లోకి లాగుతున్నారు.
 
టిఆర్‌ఎస్‌ ముఖ్యనేత హరీష్‌ రావు ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ…. వైఎస్‌, నల్లారి ప్రస్తావన చేశారు. 2009 ఎన్నికలను గుర్తుచేస్తూ, అప్పట్లో తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే కర్నూలులో జరిగిన సభలో వైఎస్‌ మాట్లాడుతూ… టిఆర్‌ఎస్‌ గెలిస్తే హైదరాబాద్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్టు, వీసా కావాల్సివస్తుందని అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. (నాటి వైఎస్‌ ఉపన్యాసాన్ని హరీష్‌ రావు తన సెల్‌ఫోన్‌ ద్వారా వినిపించారు.) నాడు కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్‌ ఆ విధంగా మాట్లాడినపుడు… తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఏం చేశారంటూ విమర్శించారు.
 
నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా తాగునీటి పథకానికి ఏడు వేల కోట్లు కేటాయిస్తే… తెలంగాణకు ఆ విధంగా నిధులు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించినందుకు… తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను… చేతనైంది చేసుకో… అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని హరీష్‌రావు గుర్తుచేశారు. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఏం చేశారంటూ ఎద్దేవా చేశారు.
 
ఇక పాలమూరు ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమంటూ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని, అటువంటి పార్టీతో కాంగ్రెస్‌ ఏ విధంగా జతకట్టిందని ప్రశ్నించారు. టిడిపి మద్దతుతో కాంగ్రెస్‌ అధికారంలోకి ఇస్తే కృష్ణ జలాలు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటారని అన్నారు.
 
మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపిని ఎదుర్కోడానికి పాత సంగతులను టిఆర్‌ఎస్‌ తిరగదోడుతోంది. ప్రధానంగా నీటి ప్రాజెక్టులను ఆసరా చేసుకుని దాడికి దిగుతోంది.