ఉపరితల ద్రోణి ప్రభావం : తెలంగాణాలో వర్ష సూచన
ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ములుగు జిల్లాలోని వాజేడు, మంగపేట, మేడారం కన్నాయిగూడెంలో తేలికపాటి వర్షం కురిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం, కర్కగూడెం, పెద్దపల్లి జిల్లాలోని అకెనపల్లిలో చిరుజల్లులు పడ్డాయి. ద్రోణి ప్రభావంతో సోమవారం వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షంతోపాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం ఆదిలాబాద్ జిల్లా రాంనగర్, భోరజ్‌లో 40 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రి వేళ్లలో ఉరుములు మెరుపులతో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.