సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:30 IST)

అల్పపీడన ద్రోణి.. దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

భానుడు భగభగమంటున్నాడు. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి- దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
 
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారు ట్వీట్ చేశారు. విదర్భ మీదుగా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని తెలిపారు. విదర్భ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంత ఉపరితలంలో అల్పపీడనం తరహా వాతావరణం నెలకొని ఉందని, ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. 
 
వచ్చే ఐదు రోజుల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంత ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. 10వ తేదీన విదర్భ, ఛత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 12, 13 తేదీల్లో కేరళ, మాహె, కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఆ తరువాత ఎండ తీవ్రత పెరగడానికీ అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు.