తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ఉదయం గంటలకు 13.80 శాతం పోలింగ్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడ ఈ ఉదయం 9 గంటల వరకు 13.80 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పెరియాకులంలో ఓటువేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. వరుసగా మూడోసారి అన్నాడీఎంకేనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని ఆయన జోష్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ఓటు వేయడమనేది మన నిబద్దతకు నిదర్శనమన్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం. అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1.58 లక్షల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు.