శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:21 IST)

#TNElections2021 : సైకిల్‌పై వచ్చి ఓటు వేసిన హీరో విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ కూడా ఓటు వేశారు. పాత మహాబలిపురం రోడ్డు, నీలాంకరైలో నివాసముండే హీరో విజయ్.. స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇందుకోసం ఆయన తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు సైకిల్‌పై రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు, నటుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ టి.నగరులోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలకూ మంగళవారం ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళ నటీనటులు రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషిస్తుండగా, సూర్య కుటుంబం మాత్రం వాటికి దూరంగానే ఉంటూ వస్తోంది. 
 
అయితే... సూర్య, కార్తీకి కమల్ హాసన్ అంటే అభిమానం. గతంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో కమల్, రజనీకాంత్... విశాల్, సూర్య, కార్తీ టీమ్‌ను బలపరిచారు. మరి ఇప్పుడు డీఎంకె, అన్నాడిఎంకె మధ్య బలమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కమల్ హాసన్ సైతం తన సొంత పార్టీ అభ్యర్థులను బరిలో దించాడు. మరి సినీ జనం ఏ పార్టీ వైపు నిలబడతారో చూడాలి.