సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:56 IST)

సాధారణ ఓటరుగా వరుసలో నిలబడి ఓటేసిన తెలంగాణ గవర్నర్

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. ముఖ్యంగా, హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, కార్తి, శశికుమార్, రెహమాన్, హీరోయిన్లు శృతిహాసన్, అక్షర హాసన్‌లు ఓటు వేశారు. అలాగే, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా సాధారణ పౌరుల్లాగనే వరుసలో నిలబడి తమ వంతు వచ్చినంతవరకు వేచివుండి ఓటు వేశారు.
 
అలాగే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ కూడా తన వంతు వచ్చేంత వరుసలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకోసం కోవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికల ఏర్పాట్లు చేశారు.