మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (09:03 IST)

వైఎస్. షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల కొత్త పార్టీ స్థాపించడం ఖాయమై పోయారు. ఈ పార్టీ ఏర్పాటు కోసం ముహూర్తాన్ని కూడా ఆమె ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన తన కొత్త పార్టీపై షర్మిల ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
ఏప్రిల్ 10వ తేదీనే ఆమె ఎందుకు ఈ ప్రకటన చేయనున్నారనే విషయాన్ని పరిశీలిస్తే, వైఎస్ఆర్ అభిమానులకు చాలా ముఖ్యమైన రోజు. 2003లో ఇదే రోజున ఆయన చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర.. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బాటలు వేసింది. 
 
ఇప్పుడు మరోసారి ఏప్రిల్‌ 10వ తేదీ.. మరో కీలక ఘట్టానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కూతురు షర్మిల తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును అదేరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
లేదంటే అదే రోజు, అదే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రారంభించిన ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్‌ మొదటివారంనాటికి పూర్తి చేయాలని షర్మిల బృందం ప్రాథమికంగా నిర్ణయించడమూ ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది.
 
మరోవైపు, వచ్చే ఏప్రిల్‌ 10 నాటికి చేవెళ్లలో వైఎస్సార్‌ ప్రారంభించిన పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పార్టీకి సంబంధించి కీలక కార్యక్రమాన్ని అదే రోజు షర్మిల పెట్టుకోనున్నట్లు చెబుతున్నారు. 
 
ఈలోపు నిర్వహించే ఆత్మీయ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా పార్టీ విధి విధానాలు, జెండాను నిర్ణయించాలన్న ఆలోచనలోనూ షర్మిల బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో వీటికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 
మరోవైపు, వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాల విషయం చర్చించేందుకు షర్మిల బుధవారం లోటస్‌ పాండ్‌లో తన సన్నిహితులతో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమ్మేళనాలను ఏప్రిల్‌ మొదటివారం కల్లా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.