సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (14:40 IST)

'అన్నయ్య' టైటిల్‌పై కన్నేసిన 'తమ్ముడు'!!

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తున్న హీరోలు. ఒకరు మెగాస్టార్ అయితే, మరొకరు పవర్ స్టార్. వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ, అది ఇంతవరకు సాధ్యపడలేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. గతంలో విక్టరీ వెంకటేష్‌తో "గోపాలా గోపాల" చిత్రంలో నటించగా ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. 
 
ఇపుడు మరోమారు ఇదే తరహా చిత్రంలో పవన్ నటించనున్నాడు. ఈ దఫా పవన్‌తో దగ్గుబాటి రానా జతకట్టనున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ "అయ్యప్పన్ కోషియమ్" అనే చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఇందులో పవన్‌తో కలిసి రానా నటించనున్నారు. అందుకే ఈ చిత్రానికి "బిల్లా - రంగా" అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఇందులో బిల్లాగా పవన్, రంగాకా రానా కనిపించనున్నారు.
 
గతంలో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు కలిసి నటించారు. 1982లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇపుడు ఇదే టైటిల్‌లో పవన్ కొత్త చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, టైటిల్ విషయంపై ఇంకా అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, తాజాగా, సోషల్‌మీడియాలో విడుదల చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో 'బిల్లా.. రంగా' అంటూ వాయిస్ వినిపిస్తోంది. దీంతో ప‌వ‌న్ తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ఉంటార‌ని డిసైడ్ అయ్యారు. 
 
కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం తర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్, సురేందర్ రెడ్డిల ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నారు. ఈ క్రమంలో ద‌స‌రా పర్వదినాన్ని పురస్కరించుకుని పవన్ మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. దీన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌ సంస్థ నిర్మించనుంది. దీనికి సాగ‌ర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు.