సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (16:18 IST)

ఆ హీరోయిన్ల కుక్కపిల్లకు కూడా రూమ్ ఇస్తారు.. పద్మశ్రీకి మేం అర్హులం కామా?

jayasudha
ఒకప్పటి స్టార్ హీరోయిన్, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ''నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. బాలీవుడ్‌లో అయితే అందరూ అభినందిస్తారు, ఫ్లవర్ బోకేలు పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బోకేలు ఇచ్చిన వాళ్లు కూడా లేరు. అదే హీరో అయితే చాలా హడావుడి చేసేవాళ్ళు. 50 ఏళ్ళు అయినందుకు పెద్ద పార్టీ ఇవ్వమని కొంతమంది చెప్పారు. కానీ నాకు అది నచ్చలేదు. 
 
ఇండస్ట్రీలో హీరోలను ఒకలాగా, హీరోయిన్స్‌ను ఒకలాగా చూస్తారు. హీరోల కంటే వాళ్ళ పక్కన ఉండే వల్లే ఎక్కువ హడావిడి చేస్తారు. హీరోలు డ్యాన్సులు సరిగ్గా చేయకపోయినా మమ్మల్నే అనేవాళ్ళు. ఇక ఇక్కడి హీరోయిన్స్ ని, ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్‌ను ఒకలా ట్రీట్ చేస్తారు. వాళ్ల కుక్క పిల్లకు కూడా రూమ్ ఇస్తారు. మనల్ని మాత్రం పట్టించుకోరు. నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, డిమాండ్ చేసినా ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండేదాన్ని కాదు... అంటూ తీవ్ర విమర్శలు చేసారు. 
 
కాగా జయసుధ సినీ పరిశ్రమకి వచ్చి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. నటిగానే కాక నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా రాణించారు. జయసుధ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.  
 
"సినీ ఇండస్ట్రీలో నేను డబ్బు ఎలా కూడబెట్టుకోవాలో నేర్చుకోలేకపోయాను. మా ఎన్నికలు జరిగే సమయంలో ఆ గోల భరించలేక అమెరికాకు వెళ్ళిపోయాను. అదో పెద్ద కథ. మా అసోసియేషన్ బిల్డింగ్ కడతామని మురళీ మోహన్ గారి టైమ్ నుంచి చెబుతున్నారు. ఇంకో పాతికేళ్ళు ఉన్నా అది పూర్తవుతుందని నమ్మకం నాకు లేదు. నాకు పద్మశ్రీ రాలేదని చాలా మంది అడిగారు. కంగాన రనౌత్‌కు ఇప్పించారు. నాకు ఎందుకు రాలేదో నాకు కూడా తెలీదు" అని చాలా విషయాలు ఇలా ఓపెన్‌గా చెప్పారు. పద్మశ్రీకి బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రమే అర్హులా.. తెలుగు హీరోయిన్లకు ఆ అర్హత ఉండదా? అని ప్రశ్నించారు. 
 
ఇకపోతే.. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. ఆమె ఇండస్ట్రీకి  వచ్చిన 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 50 ఏళ్లకు సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’  తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో జయసుధ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.