శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (07:17 IST)

కరోనా పాజిటివ్ : క్రిటికల్ కండిషన్‌లో శివశంకర్ ఆరోగ్యం

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్ శివశంకర్. ప్రస్తుతం ఈయనతో పాటు.. ఆయన భార్య, మరో కుమారుడికి కరోనా వైరస్ సోకింది. వీరిలో శివశంకర్, ఆయన పెద్ద కుమారుడు హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురిలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా వుంది.
 
గత 4 రోజులుగా ఈ ఆస్పత్రిలో చికిత్స పొందున్న శివశంకర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా, ఆయన ఊపిరితిత్తులు 75 శాతం మేరకు ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా వైరస్ కారణంగా అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. శివశంకర్ భార్య కూడా ఈ వైరస్ బారినపడి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. చిన్న కుమారుడు అజయ్ కృష్ణ ఒక్కరే తల్లిదండ్రులు, అన్న బాగోగులు చూసుకుంటున్నారు. 
 
మరోవైపు, శివశంకర్ ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక సమస్య పెద్ద ఆటంకంగా మారింది. దీంతో దాతలు ఆర్థిక సాయం చేయాలని అజయ్ కృష్ణ కోరుతున్నారు. ఏఐజీలో శివశంకర్‌కు జరుగుతున్న చికిత్స చాలా ఖరీదుతో ఉన్నందున దాతలు ఆర్థిక సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని అజయ్ కృష్ణ కోరుతున్నారు.