1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:29 IST)

బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వారిద్దరి వెంటే ఉంటా : నాగబాబు

తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్‌కు మధ్య వివాదంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి దూరి లేనిపోని విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యక్తిగత విమర్శలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
 
వీటిపై నాగబాబు స్పందించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్‌ల‌ను వదిలిపెట్టబోనని, తుదిశ్వాస వరకు వారితోనే ఉంటానన్నారు.
 
సిద్ధాంతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ తామంతా ఒకటేనన్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వ్యంగ్య సమాధానాలు చెప్పిన ఆయన.. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకూ అదే రీతిలో సమాధానమిచ్చారు.
 
రాజకీయాలంటే ఆసక్తి లేనప్పుడు.. ప్రజలకు ఎలా సేవ చేస్తారని ఆ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో స్పందించిన ఆయన.. అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలా? అని ఎదురు ప్రశ్నించారు. 
 
'అరెరె.. ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ తప్పు చేశానే. పెద్ద సమస్యే. అవన్నీ పక్కనపెడితే నేను కష్టాల్లో ఉన్న వారికి చేతనైనంత సాయం చేస్తాను. నా సోదరులతోనే ఎప్పుడూ ఉంటాను' అని రిప్లై ఇచ్చారు. 
 
మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'మంది ముందు మాట్లాడే వాడు పులి.. మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి' అని జవాబిచ్చాడు. అలాగే, మరో పోస్ట్‌కు కూడా ఆయన పెట్టారు. 'నేను బలహీనుడనని నువ్వంటే.. బలవంతుడనని చెప్పి నా టైమ్‌ను వృథా చేసుకోను. మరింత దృఢంగా మారి అసమాన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పని నిరూపిస్తా" అంటూ కామెంట్స్ చేశారు.