1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (18:22 IST)

కింగ్ ఆఫ్‌ గోల్కొండ - లోగో ఆవిష్క‌రించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

King of Golconda team-mantri
జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన పోరాట యోదుడు సర్వాయి పాపన్న‌. ఆయ‌న‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న‌ `కింగ్ ఆఫ్ గోల్కొండ‌` (స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న‌) చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్‌లో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ల్లె ల‌క్ష్మ‌ణ్ రావు గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.
 
లోగో ఆవిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అన్ని వ‌ర్గాల వారిని ఐక్యం చేసి దౌర్జ‌న్యాల‌ను ఎదుర్కొంటూ, దోపిడీ వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించి  ఒక సామాన్య వ్య‌క్తి కూడా సంక‌ల్ప బలంతో మ‌హారాజుగా ఎదగొచ్చ‌ని ఆ నాడే నిరూపించారు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న‌. 33 కోట‌ల‌ను జ‌యించి గొల్కొండ‌పై త‌న విజ‌య‌కేతనాన్ని ఎగుర‌ వేసిన ఆ మ‌హ‌నీయుడి చ‌రిత్ర విస్మ‌ర‌ణ‌కు గురి కావ‌డం బాధాకరం. ఆ బ‌హుజ‌న వీరుడి విగ్ర‌హం ఇంగ్లండ్‌లో ప్ర‌తిష్టించ‌బ‌డింది అంటే ఆయ‌న ఎంత గొప్ప  మ‌హా రాజు అనేది ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. మరుగున ప‌డ్డ ఆయ‌న చ‌రిత్ర ఇప్పుడిప్పుడే వెలుగులోకి  వ‌స్తోంది. దాన్ని ఎవ‌రూ ఆప‌లేరు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఈరోజు నా చేతుల మీదుగా పాప‌న్న విగ్ర‌హాలతో పాటు ఈ చిత్రం లోగో  ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంది. ఇలాంటి మ‌హానీయుడు పై ప్ర‌తాని రామ‌కృష్ణ గారు సినిమా చేయ‌డం చాలా సంతోషం. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను అధ్య‌యనం చేసి ఒక గొప్ప వీరుని క‌థ  అంద‌రికీ తెలిసే విధంగా అంతే గొప్పగా తీయాల‌ని కోరుకుంటున్నా. దానికోసం అనుభ‌వ‌జ్ఞులైన నటీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను తీసుకోని ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా వంద రోజుల చిత్రంగా మ‌ల‌చాల‌ని` అన్నారు.
 
తెలంగాణ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు డా. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ, పాప‌న్న 371వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ రోజు ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా తీస్తోన్న `కింగ్ ఆఫ్ గోల్కొండ‌` చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంది. విస్మ‌ర‌ణ‌కు గురైన పాప‌న్న చరిత్ర‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం. అతి సామాన్యుడైన పాప‌న్న న‌వాబుల‌పై తిరుగుబాటు చేసి ఎలా 33 కోట‌ల‌ను జ‌యించాడు, బ‌హుజన బాంధ‌వుడుగా ఎలా ఎదిగాడు  అనేది `కింగ్ ఆఫ్ గోల్కొండ` చిత్రం.
లండ‌న్ లైబ్ర‌రీలో పొందుప‌రిచి ఉన్న పాప‌న్న హిస్ట‌రీ  తెప్పించి. ఎంతో అధ్య‌యనం చేసి ఈ క‌థ త‌యారు చేశాం. ఎక్క‌డా క‌ల్పితాలు లేకుండా వాస్త‌వికంగా 50 కోట్ల భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో  తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. దీనికి ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌ని చేయ‌నున్నారు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తాం అన్నారు.
 
నిర్మాత ప‌ల్లె ల‌క్ష్మ‌ణ‌రావు మాట్లాడుతూ, ఒక గొప్ప వీరుడు చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో  నిర్మించ‌డం గ‌ర్వంగా ఉంది. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా 50కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
 హీరో వంశీ మాట్లాడుతూ, న‌న్ను న‌మ్మి స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న పాత్ర నాతో చేయిస్తోన్న ప్ర‌తాని రామ‌కృష్ణ గారికి ధ‌న్య‌వాదాలు. క‌చ్చితంగా ఈ పాత్ర‌కు నూరుపాళ్లు న్యాయం చేయ‌డానికి నా శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తా`` అన్నారు.
 ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్ననిర్మాత ఏ.గురురాజ్ మాట్లాడుతూ...`పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం విజ‌యవంతం కావాల‌న్నారు.
హీరోయిన్స్ అలేఖ్య‌, మాధ‌వి, గెహ‌న‌, వాన్య అగ‌ర్వాల్  అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.