మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (16:37 IST)

వరుస పరాజయాల ఎఫెక్ట్ : పారితోషికం తగ్గించుకున్న రవితేజ

తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాతలకు కాసులవర్షం కురిపిస్తూ వచ్చిన హీరో రవితేజ. మాస్ మహారాజాగా గుర్తింపు పొందాడు. రవితేజ హీరోగా చిన్నబడ్జెట్‌తో చిత్రాలు నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసేది. అయితే, గత కొంతకాలంగా రవితేజ చిత్రాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. దీనికితోడు రవితేజ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దీంతో ఆయనకు సినిమా ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ తాను తీసుకునే రెమ్యునరేషన్‌ను తగ్గించుకోడనే టాక్ ఫిల్మ్ నగర్‌లో ఉంది.
 
ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీన రవితేజ తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలకు మంచి కబురు పంపారు. తన రెమ్యునరేషన్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆ మధ్య కూడా రవితేజ తన పారితోషికం విషయంలో మెట్టుదిగి రాకపోవడంతో రెండు మూడు ప్రాజెక్టులు ఆగిపోయాయి కూడా. తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న సినిమా విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తినట్టుగా చెప్పుకున్నారు. 
 
రవితేజ హీరోగా ఆ మధ్య వచ్చిన 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలు వరుస పరాజయాలను అందుకున్నాయి. ఈ ప్రభావం తన తదుపరి చిత్రాలపై పడటంతో రవితేజ దిగిరాక తప్పలేదు. తొలుత ఆయన మెట్టు దిగేందుకు ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఆయన పునరాలోచన చేసి తన నిర్ణయాన్ని వెల్లడించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.