శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:21 IST)

'ఆర్ఆర్ఆర్' గురించి మొదటిసారి మాట్లాడిన జక్కన్న

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరో భారీ బడ్జెట్, భారీ మల్టీస్టారర్ చిత్రం "ఆర్ఆర్ఆర్" ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన రోజుల్లో కొద్ది రోజులు రామ్ చరణ్ పైన, కొద్ది రోజులు ఎన్‌టీఆర్ పైన కొన్ని సన్నివేసాలను షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ కనిపించే సన్నివేసాల చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.
 
ఇప్పటికే పాత్రకు తగ్గట్లు కనిపించడం కోసం తగిన శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఎన్‌టీఆర్‌ను తిరిగి రావలసిందిగా రాజమౌళి కబురు పంపడం జరిగింది. ఎన్‌టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే వచ్చే గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. హీరోలిద్దరూ కనిపించే సన్నివేసాలను పూర్తి చేసే వరకు ఈ షెడ్యూల్ విరామం లేకుండా సాగుతుందని సమాచారం.
 
ఇలావుండగా, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు బయట ఎక్కడా మాట్లాడని రాజమౌళి మొదటిసారి హార్వర్డ్ యూనివర్శిటీలో 'ఇండియా ఎట్ యాన్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ థీమ్'లో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా సినిమా అని, బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్లు ఎవరో వెల్లడించకపోవడం గమనార్హం.