ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (16:25 IST)

46 ఏళ్ల పడిలోకి యాంకర్ సుమ.. అలా ఫోన్ చేసి అడగడంతో పెళ్లికి ఒప్పుకున్నారట!

యాంకర్ సుమ ఈ రోజుతో 46 ఏళ్ల పడిలోకి ఆమె అడుగుపెట్టారు. లేడి యాంకర్‌గా టాలీవుడ్‌ను దున్నేస్తున్న సుమ అటు యాంకర్‌గా తన వృత్తిలో రాణిస్తూ, ఇటు ఇల్లాలిగానూ తన కుటుంబానికి తోడు నీడలా ఉన్నారు. యాంకర్ సుమది ప్రేమ పెళ్లి అని అందరికీ తెలిసిందే. తెలుగువాడైన రాజీవ్ కనకాల, మలయాళీ అయిన సుమ ప్రేమ పెళ్లి చేసుకోవడం అప్పట్లోనే ఓ సెన్సేషన్. 
 
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల సినీ నటులకు శిక్షణ ఇచ్చేవారన్న సంగతి తెలిసిందే. అటు చిరంజీవి దగ్గర నుంచి రజనీకాంత్ వరకు మెజారిటీ హీరోలు ఆయన దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నవాళ్లే. రాజీవ్ కనకాల కూడా మొదట్లో సీరియల్స్‌తో కెరీర్‌ను మొదలు పెట్టాడు. 
 
1994వ సంవత్సరంలోనే సుమకు ప్రేమ సందేశాన్ని పంపాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత 1999లో వారి ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్ల ప్రేమ పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదండోయ్. వారి మధ్య ప్రేమ గురించి రాజీవ్ కనకాల తల్లిదండ్రులకు మొదట సుమే చెప్పింది. వారి పెళ్లికి దేవదాస్ కనకాల ఓ కండీషన్ కూడా పెట్టారు. ఈ విషయాలను దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
"మీ అబ్బాయి, నేను ప్రేమించుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. అని ఓ రోజు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటికే వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు మేం గ్రహించాం. అయితే సుమకు మాత్రం ఓ విషయం క్లారిటీగా చెప్పాను. 
 
'నువ్వు మీ అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతురివి. మీ వాళ్లు ఒప్పుకుంటేనే రాజీవ్‌తో నీ పెళ్లి జరుగుతుంది. లేదంటే మాత్రం ఈ పెళ్లి గురించి మర్చిపో అని ఒకే ఒక్క కండీషన్ పెట్టా. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ, కొద్ది రోజుల తర్వాత సుమ వాళ్ల నాన్న మా ఇంటికి వచ్చారు. మాట్లాడి వాళ్లిద్దరికీ 1999వ సంవత్సరంలో పెళ్లి చేశాం" అని దేవదాస్ కనకాల చెప్పుకొచ్చారు.