మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (15:00 IST)

శర్వానంద్ పుట్టిన రోజు.. గమ్యంతో మొదలెట్టి శ్రీకారం చుట్టాడు.. (video)

గమ్యంతో హీరోగా మంచి విజయం సాధించిన దగ్గర నుంచీ శర్వానంద్ వెరైటీ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో శర్వానంద్ ఎంపికకు తగిన చిత్రంగా 'ప్రస్థానం' నిలిచింది. అందులోనూ అతని వైవిధ్యమైన అభినయం అలరించింది. 'రన్ రాజా రన్'తో మరింత సక్సెస్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు శర్వానంద్. 'మళ్ళీ మళ్ళీ  ఇది రానిరోజు'తో నటునిగా మంచి మార్కులు కొట్టేశాడు. 
 
'రాజాధిరాజా, ఎక్స్ ప్రెస్ రాజా'తో రాజాలా సాగినా, 'శతమానం భవతి'తో కెరీర్ బెస్ట్ హిట్ పట్టేశాడు శర్వానంద్. "రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను" ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే 'శతమానం భవతి'లాగా గ్రాండ్ సక్సెస్‌తో పులకరించలేకపోయాడు. ప్రస్తుతం 'శ్రీకారం' శర్వానంద్ ఆశలపల్లకిలా ఊగిసలాడుతోంది. 
 
ఇప్పటికే ఇందులోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. కాబట్టి సినిమా సైతం శర్వానంద్ అభినయపర్వంలో సరికొత్త అధ్యాయానికి 'శ్రీకారం' చుడుతుందని ఆశిస్తున్నారు. ఇది కాకుండా 'మహాసముద్రం'లోనూ శర్వానంద్ నటిస్తున్నాడు. మరో చిత్రంతోనూ సందడి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 
 
ఇప్పటికే ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. రాయలసీమ యాసలో సాగే భలేంగుంది బాలా పాట జనాల్లోకి బాగా వెళ్ళింది కూడా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని వదిలింది చిత్ర బృందం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే శర్వానంద్‌కి అమెరికాలో మేనేజర్‌గా ఆఫర్ వస్తుంది. ఐతే అది వద్దని వ్యవసాయం చేద్దామని తన ఊరికి వస్తాడు శర్వానంద్.
 
అక్కడ తనకెదురయ్యే పరిస్థితులు, ఊళ్ళో భూముల కోసం జరిగే పంచాయితీల మధ్య శర్వానంద్ నాన్న రావు రమేష్ నలిగిపోతుంటాడు. వాటన్నింటినీ కాదనుకుని వ్యవసాయం చేసి ఏ విధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడనేదే కథ. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే, అది ఉమ్మడి వ్యవసాయం. 
 
పొలాలని బీడులుగా ఉంచకుండా ఉమ్మడిగా వ్యవసాయం చేసి సేద్యం గెలుద్దామన్న శర్వానంద్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, కిషోర్ బి దర్శకత్వం వహించారు.