1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (18:26 IST)

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వాణి జయరాం అంత్యక్రియలు

vani jayaram
సుప్రసిద్ధ గాయని వాణీ జయారం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆమె భౌతికాయానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. వాణీ జయరాం శనివారం తన నివాసంలోనే కన్నుమూసిన విషయం తెల్సిందే. పడక గదిలో కిందపడటంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు విడిచారు. అయితే, ఆమె నుదుటిపై గాయం ఉండటంతో వాణీ జయరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
కాగా, 78 యేళ్ళ వాణీ జయరాం చెన్నై నుంగంబాక్కంలోని తన నివాసంలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈమె భర్త గత 2018లో చనిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నారు. ఆమె ఇంట్లో మలర్కొడి అనే పనిమనిషి పని చేస్తున్నారు. వాణి జయరాం కిందపడిన సమయంలో పని మనిషి కూడా లేరు. 
 
మరోవైపు, వాణీ జయరాం భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం నివాళులు అర్పించారు. అలాగే, మరికొందరు సినీ ప్రముఖులు కూడా అంజలి ఘటించారు. ఆ తర్వాత ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రగా బీసెంట్ నగరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.