శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (17:25 IST)

అక్షరం అంగడి సరుకైంది... నందితా శ్వేత అదరగొట్టింది...

చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేక అప్పులపాలైన తల్లిదండ్రులు.. వంటి హెడ్‌ లైన్స్‌ తరచూ చూస్తున్నాం. అందుకు కారణమేంటీ.. అంటే అక్షరం అంగడి సరుకైంది. విద్య వ్యాపారమైంది అని.. ఇది తప్పని ఎవరికి వారు భావిస్తుంటారే.. తప్ప ఎవరూ మార్పును గురించి ఆలోచించరు. కానీ అమ్మకపు సరుకుగా మారిన కార్పోరేట్‌ విద్యా విధానం మారాలంటూ.. అతి పెద్ద వ్యాపారంగా మారిన అక్షరానికి ఆలంబనగా మారిందో యువతి. 
 
వివేకాన్ని ఇవ్వవలసిన విద్య వ్యాపారంగా మారితే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా మారుతుందనేది అందరికీ తెలుసు. తెలిసీ ఉదాసీనంగా ఉండేవారిని సైతం ప్రశ్నిస్తూ అక్షర అనే యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో వస్తోన్న సినిమా 'అక్షర'. లేటెస్ట్‌‌గా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్‌ సాంగ్‌‌ను విడుదల చేశారు. అక్షర సినిమా థీమ్‌‌ను తెలియజేసేలా సాగే ఈ పాట విన్న ఎవరికైనా గూస్‌ బంప్స్‌ రావడం ఖాయం. 
 
చైతన్య ప్రసాద్‌ రాసిన ఈ పాటలోని ప్రతి అక్షరం ఓ అగ్నికణంలా కనిపిస్తుంది. 'అసులదర.. నిశలు చెదర.. అక్షరాగ్ని శిఖలు ఎగసి ఆగ్రహించెలె.. సమరమిపుడే సమయమిపుడే కలం కూడ కత్తి దూసి కదం తొక్కెలే'' అంటూ సాగే ఈ పాట ఈ యేడాదికే ది బెస్ట్‌ సాంగ్‌గా నిలుస్తుందని విన్న ఎవరైనా ఒప్పుకుంటారు. గాడి తప్పుతోన్న విద్యావ్యవస్థ పైన ఈ స్థాయిలో అక్షరాలను ఎక్కుపెట్టిన కవి మనకు కనిపించడు. సినిమా థీమ్‌‌ను ఆవాహన చేసుకున్నాడా అనేలా చైతన్య ప్రసాద్‌ కలం కదం తొక్కింది.
 
''చదువునే అమ్మితే దోపడీ సాగితే తిరుగుబాటొక్కటే రక్షా'' అంటూ తేల్చివేస్తాడు. మొత్తంగా ఈ పాటతో సినిమా స్థాయి ఏంటో కూడా తెలిసిపోతుంది. అక్షర సినిమాను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి అనుకునేలా సాగుతుంది ఈ పాట. అతి తక్కువ సమయంలోనే ప్రతిభావంతమైన నటిగా పేరు తెచ్చుకున్న నందిత శ్వేత టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్‌, షకలక శంకర్‌, శ్రీ తేజ, అజయ్‌ ఘోష్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.