ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (09:27 IST)

అభిశంసనకు సమ్మతిస్తే పునాదులే కదిలిపోతాయ్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య

విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసుకు సమ్మతం తెలిపితే న్యాయవ్యవస్థ పునాదులే కూలిపోయే ప్రమాదం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసుకు సమ్మతం తెలిపితే న్యాయవ్యవస్థ పునాదులే కూలిపోయే ప్రమాదం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును అనుమతించాలా వద్దా అనే అంశంపై సభాపతి ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్‌, భారత ప్రభుత్వ న్యాయసలహాదారు మొదలైన వారిని సంప్రదించవచ్చునని 'ఎం.కృష్ణస్వామి వర్సెస్‌ కేంద్రం ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రధాన న్యాయమూర్తిపైనే అభిశంసన నోటీసు ఇచ్చినందున... ఆయనను కాకుండా, ఇతర నిపుణులతో చర్చించాను. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఈ సందర్భంగా న్యాయనిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
 
* న్యాయవ్యవస్థ నిర్వహణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సభాపతి అత్యంత జాగరుకతతో బాధ్యతతో వ్యవహించాల్సి ఉంటుందని సుప్రీం భావించింది. సాధారణ ప్రజలపై తన నిర్ణయ ప్రభావాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోవాలని కూడా తెలిపింది.
 
* పార్లమెంటరీ విధానాల ప్రకారం ఒక న్యాయమూర్తిని తొలగించాలంటే ఆ జడ్జి దుష్ప్రవర్తన రుజువై ఉండాలి. కానీ... ఇక్కడ అనుమానాలు, ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ముడుపుల చెల్లింపుల కుట్రలో ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి అయి ఉండొచ్చు... అని తెలిపారు.
 
* మాస్టర్‌ ఆఫ్‌ ది రోస్టర్‌గా ప్రధాన న్యాయమూర్తి అధికారాలను ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ధ్రువీకరించింది. ఈ విషయంపై ఏమైనా విభేదాలుంటే అవి సుప్రీంకోర్టులో అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిందే. 
 
* రాజ్యాంగానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంరక్షక బాధ్యత వహించాల్సింది న్యాయ వ్యవస్థే. దాని స్వతంత్రత ప్రశ్నించేందుకు వీలులేదు. అందుకే, న్యాయమూర్తుల తొలగింపునకు సంబంధించి రాజ్యాంగ అధికరణలో, న్యాయమూర్తుల విచారణ చట్టంలో కట్టుదిట్టమైన షరతులను విధించారు. 
 
* ఒక న్యాయమూర్తిని తొలగించాలంటే అసాధారణమైన, అత్యంత ముఖ్యమైన, చెప్పుకోదగిన ఆధారాలు ఉండాలి. అలాంటివేవీ విపక్షాల నోటీసులో కనిపించలేదని న్యాయకోవిదులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం.