శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:24 IST)

తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్?

రక్షణ రంగంలో సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ఇందలోభాగంగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్టును కొత్తగా చేపట్టనున్నారు. అంటే సైన్య, వాయుసేన, నావికాదళాలన్నీ కలపి ఒకే అధిపతి కింద పని చేయనున్నాయి. నిజానికి ఈ మూడు రంగాలు ప్రస్తుతం వేటికవే ప్రత్యేకం. వాటికి విడిగా అధిపతులు ఉన్నారు. 
 
అయితే, సాయుధ దళాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని, అందుకే కొత్తగా సాయుధ దళాల కోసం ఉమ్మడి అధిపతి పదవిని సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. 
 
'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' (సీడీఎస్) పదవి ద్వారా భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని, తద్వారా మూడు దళాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని వివరించారు. దీంతో రక్షణ రంగంలో కూడా మోడీ తనదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
సాంకేతిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న వేళ సైనిక, వాయుసేన, నావికాదళాలు విడివిడిగా వ్యూహాలు రూపొందించుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావని, త్రివిధ దళాలు ఉమ్మడిగా కార్యాచరణకు దిగాలంటే 'సీడీఎస్' పదవి అవసరమని తాము భావిస్తున్నామని మోడీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.