టాప్ ట్రెండింగ్‌లో 2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఆదివారంతో రెండేళ్లు పూర్తయింది. ఇది వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చింది. అదేసమయంలో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. '2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
జాతీయస్థాయిలో ఈ హ్యాష్ ట్యాగ్ శనివారం నెంబర్ వన్ పొజిషన్‌లో ట్రెండింగ్ అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ రంగప్రవేశం చేసిన కొన్ని గంటల్లో లక్షల్లో ట్వీట్లు వచ్చాయి. గత సంవత్సరం సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన హ్యాష్ ట్యాగ్‌ను 20 లక్షల మంది ట్వీట్ చేశారు. తాజా హ్యాష్ ట్యాగ్ కూడా అదే రీతిలో దూసుకుపోతోంది.
మరోవైపు, తన రెండేళ్ళ పాలనపై ప్రత్యేక పుస్తకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. తాడేపలి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రివర్గ సహచరులు, అధికారుల సమక్షంలో సీఎం జగన్ పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సహకారంతో దిగ్విజయంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. వాటిలో 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు.
తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలోని 86 శాతం ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ది పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 1.64 కోట్ల నివాస గృహాలు ఉంటే, వాటిలో 1.41 కోట్ల గృహాలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు ప్రజలకు మేలు చేశానన్న సంతృప్తి ఉందని, మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేశానని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.