చల్లటి ప్రదేశంలో వేడెక్కిన వాతావరణం... పాన్‌గాంగ్ సరస్సు వద్ద కాల్పులు...
భారత్, చైనా మధ్య గల్వాన్ లోయలో ఇటీవల జరిగిన ఘర్షణల ఉద్రిక్తత తగ్గకముందే మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి గత కొన్ని రోజులుగా భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే. లడఖ్‌లోని పాన్‌గాంగ్ సరస్సు వద్ద సోమవారం భారత సైనికులు కాల్పులు జరిపినట్లు చైనా ఆరోపించింది. వాస్తవాధీన రేఖను దాటి వచ్చిన భారత జవాన్లు.. వార్నింగ్ కాల్పులు చేసినట్లు చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు ఆరోపించాయి. అయితే ఆ వ్యాఖ్యలను మంగళవారం భారత్ కొట్టిపారేసింది.
చాలా తీవ్ర స్థాయిలో సైనిక కవ్వింపులు జరుగుతున్నాయని, తప్పుడు ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి కల్నల్ జాంగ్ సుహిలి తెలిపారు. అధికారిక మిలిటరీ వెబ్‌సైట్‌లో చైనా తన ప్రకటన చేసింది. భారత దళాలు కాల్పులు జరిపిన వెంటనే.. పరిస్థితిని శాంతింప చేసేందుకు తమ దళాలు రక్షణాత్మక చర్యలు చేపట్టినట్లు సుహిలి తన ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందిన తర్వాత రెండు దేశాల సరిహద్దులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. పలుమార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగినా.. సమస్య కొలిక్కిరావడం లేదు. ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపేయాలని భారత్‌ను అభ్యర్థిస్తున్నామని, అయితే హెచ్చరిక కాల్పులు జరిపిన సంఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సుహిలి తన ప్రకటనలో కోరారు.