మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:32 IST)

తిరుపతిలో జనసేనాని ఎఫెక్ట్, తిరుపతికి సీఎం జగన్?

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా? తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపికి గడ్డుకాలమే అంటూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలతో ఆలోచనలో పడిపోయారు. హడావిడిగా పర్యటనకు సర్వం సిద్థం చేసుకున్నారా.. ఇప్పుడిదే రాష్ట్రరాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది.
 
వైసిపి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల రెండు నెలల్లో మా పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించడంటూ ఎప్పుడూ ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన సందర్భాలు లేవు. ఎన్నికలపాటికు ఎన్నికలు జరుగుతుంటాయి. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకుంటారన్న ధీమా జగన్‌లో ఉండేది.
 
కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఎందుకో వైసిపి రాణించడం కష్టమని ఇంటెలిజెన్స్ నివేదిక జగన్‌కు వెళ్ళిందట. దీంతో స్థానిక మంత్రులతో పాటు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీ కార్యక్రమానికి ప్లాన్ చేశారట.
 
తిరుమల శ్రీవారిని దర్సించుకున్న తరువాత నేరుగా తిరుపతికి వచ్చి పార్టీ ర్యాలీలో పాల్గొని ఆ తరువాత బహిరంగసభలో పాల్గొనబోతున్నారట జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పే ప్రయత్నం కూడా జగన్ చేయబోతున్నారట. ఇప్పటికే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మొన్న జనసేనాని విమర్శించిన సంగతి తెలిసిందే.
 
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తిరుపతి పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఎలాగైనా తిరుపతి ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం కలిగించాలన్న ఆలోచనలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. ఉన్నట్లుండి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫిక్స్ చేసుకోవడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.