ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (15:07 IST)

ఔను.. ఆయనతో మాట్లాడా.. అది నా మర్యాద.. మరోలా అర్థం చేసుకోవద్దు : పవన్

గత కొంతకాలంగా ఎడమొహం.. పెడమొహంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు మళ్లీ మాట్లాడుకున్నారు. వీరిద్దరూ కొద్దిసేపు రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి

గత కొంతకాలంగా ఎడమొహం.. పెడమొహంగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు మళ్లీ మాట్లాడుకున్నారు. వీరిద్దరూ కొద్దిసేపు రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి... తమ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సాక్ష్యం గణపతి సచ్చిదానందస్వామి. ఈయన సమక్షంలోనే వీరిద్దరూ మాట్లాడుకున్నారు.
 
శుక్రవారం గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలంలో విగ్రహప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇది ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
దీంతో పవన్ స్పందించారు. "రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా. వ్యక్తిగతంగా చూడను. ఇది కొరవడటం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి. నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద. నేను కలసే లేదా శుభాకాంక్షలు తెలిసే నేతలందరికీ నేనెవరో తెలుసు. రాజకీయ ప్రయాణంలో భాగంగా పరిచయాలు ఏర్పడతాయి. తన మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగేటప్పుడు అక్కడ ఇద్దరూ పలకరించుకున్నారు. 'సార్‌ బాగున్నారా' అని  చంద్రబాబును పవన్ ముందు పలకరించారు. 'బాగున్నాను.. మీరెలా ఉన్నారు' అంటూ సీఎం ప్రతిస్పందించారు. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయి తీర్థ ప్రసాదాలిచ్చే సమయంలో వేద పండితులు పవన్‌ నిలబడిన వైపు నుంచి వస్తూ ముందు ఆయనకు ఇవ్వబోయారు. 'కాదు.. కాదు.. ముందు ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి' అని పవన్‌ వారిని కోరారు. దీంతో చంద్రబాబుకు తీర్థప్రసాదాలిచ్చాక పండితులు పవన్‌కు ఇచ్చారు.