మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (08:52 IST)

విశాఖలో కెమెకల్ గ్యాస్ లీక్ ... ముగ్గురు మృతి - 200 మందికి అస్వస్థత

సముద్రతీర ప్రాంతం విశాఖపట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు వృద్ధులు, ఓ బాలిక ఉంది. అస్వస్థతకు గురైనవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత రసాయన వాయువు లీకైంది. ఈ వాయువు సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. దీనిని పీల్చిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ గాలి పీల్చిన కొందరు రోడ్డుపైనే పడిపోయారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కంపెనీని తెరిచే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 
 
అలాగే, విధుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలాడు. గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కేజీహెచ్‌కు తరలించారు.