శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (15:59 IST)

ఏపీలో జగన్ గెలుస్తారు .. మేం కలిసి పని చేస్తాం : కేటీఆర్ జోస్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా పార్టీ గెలవనుందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆయన తెరాస ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్ వస్తారని, ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నామన్నారు. 
 
జగన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్‌తో కలిసి పని చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ వేశారా? అని ప్రశ్నించారు. మాటలతో ఆకట్టుకోవడం తప్ప మోడీ చేసిందేమీ లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. 
 
ఏప్రిల్ 11 తర్వాత పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పిన కేటీఆర్, గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టంచేశారు.